తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Zimbabwe: టీమిండియాకు షాకింగ్ పరాజయం.. ప్రపంచ చాంపియన్ అయిన వారానికే జింబాబ్వే చేతిలో ఓటమి

India vs Zimbabwe: టీమిండియాకు షాకింగ్ పరాజయం.. ప్రపంచ చాంపియన్ అయిన వారానికే జింబాబ్వే చేతిలో ఓటమి

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 06, 2024 08:10 PM IST

India vs Zimbabwe 1st T20: భారత జట్టుకు షాకింగ్ ఓటమి చెందింది. జింబాజ్వే చేతిలో పరాజయం పాలైంది. టీ20 ప్రపంచకప్ గెలిచినా వారానికి టీమిండియాకు ఈ ఓటమి ఎదురైంది.

India vs Zimbabwe: టీమిండియాకు షాకింగ్ పరాజయం.. ప్రపంచ చాంపియన్స్ అయిన వారానికే జింబాబ్వే చేతిలో ఓటమి
India vs Zimbabwe: టీమిండియాకు షాకింగ్ పరాజయం.. ప్రపంచ చాంపియన్స్ అయిన వారానికే జింబాబ్వే చేతిలో ఓటమి

జింబాబ్వే పర్యటనను టీమిండియా షాకింగ్ ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20లో జింబాబ్వే చేతిలో భారత్ పరాజయం చెందింది. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి విశ్వ చాంపియన్‍గా నిలిచిన సరిగ్గా వారానికి భారత్‍కు ఈ ఓటమి ఎదురైంది. అయితే, ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లు ఎవరూ జింబాజ్వేతో మ్యాచ్‍లో లేరు. యువ భారత ఆటగాళ్లు బరిలోకి దిగారు. హరారే వేదికగా నేడు (జూలై 6) జరిగిన మ్యాచ్‍లో భారత్ 13 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వే చేతిలో ఓడింది. దీంతో ఐదు టీ20 సిరీస్‍లో టీమిండియా 0-1తో వెనుకబడింది. చెత్త షాట్లు ఆడి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు భారత బ్యాటర్లు. యంగ్ స్టార్ శుభ్‍మన్ గిల్ కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచ్‍లోనే భారత్‍కు ఓటమి ఎదురైంది.

బిష్ణోయ్, వాషింగ్టన్ మ్యాజిక్ చేసినా..

ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ 4 వికెట్లతో అదరగొట్టాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులకే ఇచ్చిన 4 వికెట్లు దక్కించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‍తో మ్యాజిక్ చేసినా.. బ్యాటింగ్‍లో విఫలమైన భారత్ పరాజయం పాలైంది.

జింబాబ్వే బ్యాటర్లలో స్లివ్ మదానే (29 నాటౌట్), డియాన్ మయెర్స్ (23), వెస్లీ మధేవేరే (21) రాణించారు. కెప్టెన్ సికిందర్ రజా (17) పర్వాలేదనిపించాడు. బ్యాటింగ్‍లో అంతగా మెప్పించని బింజాబ్వే బౌలింగ్‍లో సత్తాచాటి భారత్‍ను ఓడించింది.

టపటపా కుప్పకూలిన భారత్

స్పల్ప లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది. అరంగేట్ర యువ ఆటగాడు అభిషేక్ శర్మ (0) తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (7), డెబ్యూట్ ప్లేయర్ రియాన్ పరాగ్ (2) త్వరగా ఔటవగా.. రింకూ సింగ్ (0) అనవసరమైన షాట్‍కు వెళ్లి డక్ అయ్యాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (31) మరో ఎండ్‍లో నిలకడగా ఆడాడు. ధృవ్ జురెల్ (6) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఓ ఎండ్‍లో పోరాడుతున్న శుభ్‍మన్ గిల్ 11వ ఓవర్లో ఔటయ్యాడు. జింబాబ్వే కెప్టెన్ రజా అతడిని బౌల్డ్ చేశాడు. దీంతో 10.2 ఓవర్లలో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది భారత్.

వాషింగ్టన్ సుందర్ (27) చివరి వరకు పోరాడినా గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్లో అతడు ఔటయ్యాడు. ఆవేశ్ ఖాన్ (16) కూడా కాసేపు పోరాడాడు. సుందర్, ఆవేశ్ ఆడుతున్న ఓ తరుణంలో భారత్‍కు గెలుపు ఆశలు చిగురించాయి. అయితే, 16వ ఓవర్లో ఆవేశ్‍ను రజా బౌల్డ్ చేశాడు. ముకేశ్ కుమార్ (0) డకౌట్ అయ్యాడు. సుందర్ పోరాడినా ఫలితం లేకపోయింది. జింబాబ్వే బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ సత్తాచాటారు. టీమిండియా బ్యాటర్లను నిలువరించారు.

జింబాజ్వే బౌలర్లలో కెప్టెన్ సికిందర్ రజా, తెండాయ్ చతార చెరో మూడు వికెట్లతో మెరిపించారు. బ్రియాన్ బెన్నెట్ ఓ ఓవర్ వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఓ వికెట్ తీశాడు. వెల్లింగ్టన్ మసగద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ, లుక్ జోంగ్వే తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

భారత్, జింబాబ్వే మధ్య రేపే (జూలై 7) హరారే వేదికగా రెండో టీ20 జరగనుంది.

WhatsApp channel