తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: చెత్త రికార్డు మూటగట్టుకున్న విరాట్ కోహ్లి.. సెమీఫైనల్లోనూ దారుణ వైఫల్యంతో..

Virat Kohli: చెత్త రికార్డు మూటగట్టుకున్న విరాట్ కోహ్లి.. సెమీఫైనల్లోనూ దారుణ వైఫల్యంతో..

Hari Prasad S HT Telugu
Jun 27, 2024 10:42 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లి చెత్త బ్యాటింగ్ కొనసాగుతోంది. ఈ టీ20 వరల్డ్ కప్ లో దారుణమైన ఫామ్ లో ఉన్న అతడు.. ఇంగ్లండ్ తో సెమీఫైనల్లోనూ విఫలమై ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.

చెత్త రికార్డు మూటగట్టుకున్న విరాట్ కోహ్లి.. సెమీఫైనల్లోనూ దారుణ వైఫల్యంతో..
చెత్త రికార్డు మూటగట్టుకున్న విరాట్ కోహ్లి.. సెమీఫైనల్లోనూ దారుణ వైఫల్యంతో.. (PTI)

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చెత్త ఫామ్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ కొనసాగింది. ఇంగ్లండ్ తో మ్యాచ్ లోనూ అతడు కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ తో కలిసి ఓపెనర్ గా వస్తున్న విరాట్.. ఒక్క మ్యాచ్ లోనూ సరిగా రాణించలేదు. గత మూడు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లోనూ హాఫ్ సెంచరీలు చేసిన అతడు.. తొలిసారి సింగిల్ డిజిట్ కే పరిమిత��య్యాడు.

విరాట్ కోహ్లి చెత్త ఫామ్

ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఓపెనర్ గా వచ్చిన అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి టీ20 వరల్డ్ కప్ లోనూ అదే జోరు కొనసాగిస్తాడని అందరూ ఆశించారు. కానీ అతడు మాత్రం వరుస వైఫల్యాలతో దారుణంగా నిరాశపరుస్తున్నాడు. చివరికి ఇంగ్లండ్ తో సెమీఫైనల్లోనూ కేవలం 9 పరుగులే చేసి ఔటయ్యాడు. టోప్లీ బౌలింగ్ లో ఓ చూడచక్కని సిక్స్ కొట్టిన అతడు మంచి టచ్ లో కనిపించాడు.

అయితే అదే ఓవర్లో మరో భారీ షాట్ ఆడటానికి వికెట్లను వదిలేసి ముందుకు వచ్చిన విరాట్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 బంతుల్లో 9 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో కోహ్లి 7 ఇన్నింగ్స్ లో కేవలం 75 రన్స్ మాత్రమే చేశాడు. అతని సగటు 10.71 మాత్రమే.

నాకౌట్‌లలో కోహ్లి తొలిసారి ఇలా..

విరాట్ కోహ్లి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో బాగా రాణించాడు. టీమిండియా సెమీఫైనల్ చేరిన గత మూడుసార్లూ కోహ్లి హాఫ్ సెంచరీలు చేశాడు. 2014లో సౌతాఫ్రికాపై అతడు కేవలం 44 బంతుల్లోనే 72 రన్స్ చేశాడు. ఇక 2016లో వెస్టిండీస్ పై 47 బంతుల్లో 89 రన్స్ చేయగా.. 2022లో ఇదే ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో 40 బంతల్లో 50 రన్స్ చేశాడు.

తొలిసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో విరాట్ సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమయ్యాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లోనూ విరాట్ సెంచరీ చేయడం విశేషం. అతడు కేవలం 113 బంతుల్లో 117 రన్స్ చేశాడు. కానీ ఈసారి మాత్రం తన చెత్త ఫామ్ కొనసాగిస్తూ సెమీఫైనల్లోనూ విఫలమయ్యాడు.

పైగా లెఫ్టామ్ పేస్ బౌలర్లతో ఆడటంలో తన బలహీనతను కూడా అతడు కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో మూడుసార్లు లెఫ్టామ్ పేసర్ల బౌలింగ్ లో అతడు ఔటయ్యాడు. అంతేకాదు 7 టీ20ల్లో వాళ్ల బౌలింగ్ లో కేవలం 21 రన్స్ మాత్రమే చేశాడు.

టీ20 వరల్డ్ కప్ 2024