తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Black Magic : మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి చేసిన మంత్రి అరెస్ట్​!

Black Magic : మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి చేసిన మంత్రి అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Jun 28, 2024 01:00 PM IST

Maldives President black magic : మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుపై 'బ్లాక్ మ్యాజిక్' చేశారన్న ఆరోపణలపై మాల్దీవుల పర్యావరణ శాఖ మంత్రి ఫాతిమా షమ్నాజ్ అలీ సలీంతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు

మాల్దీవుల దేశం చుట్టూ ఇటీవలి కాలంలో చాలా వివాదాలు పుట్టుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్​ ముయిజు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ సమయంలో ముయిజుపై చేతబడి జరిగిందన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. స్వయానా ఆ దేశ మంత్రి.. మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పర్యావరణ మంత్రి ఫాతిమా షమ్నాజ్​ అలీ సలీంను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ విషయాలను మాల్దీవుల స్థానిక మీడియా వెల్లడించింది.

సన్నిహితులే చేతబడి చేశారా?

జూన్​ 23న.. మాల్దీవుల అధ్యక్షుడి మహమ్మద్​ ముయిజుపై చేతబడి ఆరోపణలు బయటకు వచ్చిన నేపథ్యంలో షమ్నాజ్​తో పాటు అధ్యక్ష కార్యాలయంలో మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ భర్త ఆడమ్ రమీజ్​తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఈ నలుగురు నిందితులకు ఏడు రోజుల రిమాండ్ విధించారు. పర్యావరణ మంత్రిత్వ శాఖలో రాష్ట్ర మంత్రి పదవి నుంచి షమ్నాజ్​ను సస్పెండ్ చేసినట్లు స్థానిక మీడియా సంస్థ సన్ తెలిపింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు చీఫ్ పోలీస్ ప్రతినిధి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అహ్మద్ షిఫాన్ తెలిపారు.

మాల్దీవుల పర్యావరణ మంత్రిత్వ శాఖ వెబ్​సైట్​లో షమ్నాజ్ పేరును ప్రభుత్వం తొలగించింది. ఆమె పేరును 'మాజీ' రాజకీయ నియామకాల జాబితాలో చేర్చింది.

ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు, గతంలో మాలే సిటీ మేయర్​గా పనిచేసినప్పుడు.. ఆయన కౌన్సిల్​లో సభ్యురాలిగానూ ఉన్నారు షమ్నాజ్​. ఆమె మాజీ భర్త సైతం ముయిజు నగర మేయర్​గా ఉన్నప్పుడు మాలే సిటీ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు.

గత సంవత్సరం మాల్దీవుల అధ్యక్షుడిగా ముయిజు ఎన్నికైన తరువాత, షమ్నాజ్ మండలికి రాజీనామా చేసి అధ్యక్షుడి అధికారిక నివాసమైన ములియాజ్​లో రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆమెను పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది.

మరోవైపు, ఆమె మాజీ భర్త రమీజ్.. ముయిజుకు అత్యంత సన్నిహితుడని సమాచారం. అయితే గత ఐదు, ఆరు నెలలుగా ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడిపై ఆయన సన్నిహితుడే చేతబడి చేశారన్న వార్తల ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

కాగా, ఈ కేసుపై మాల్దీవుల ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

చేతబడి అనేది మాల్దీవుల్లో క్రిమనల్​ నేరం కాదు. కానీ ఇస్లామిక్​ చట్టాల ప్రకారం.. 6 నెలల జైలు శిక్ష ఉంటుంది.

ప్రకృతి, పర్యాటకంపై అధికంగా ఆధారపడే మాల్దీవులకు ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి చాలా ముఖ్యం! వాతావరణ మార్పులతో దేశం అల్లాడిపోతోంది. పైగా.. సముద్ర మట్టం నానాటికీ పెరుగుతున్న వేళ.. ఈ శతాబ్దం చివరికి మాల్దీవుల దేశం బతకడానికి వీలులేకుండా మారుతుందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో.. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించాల్సిన మంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం