తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shankham: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో శంఖం ఎందుకు ఊదుతారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?

Shankham: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో శంఖం ఎందుకు ఊదుతారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jan 24, 2024 09:00 AM IST

Shankham: గుడి దగ్గర పూజ మొదలైనప్పుడు శంఖానాదం వినిపిస్తుంది. అసలు శంఖం ఎందుకు ఊదుతారో తెలుసా?

శంఖం ఎందుకు ఊదుతారు?
శంఖం ఎందుకు ఊదుతారు? (pixabay)

Shankham: హిందూ మతంలో శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది కేవలం సంగీత వాయిద్యంగా మాత్రమే చూడరు. సంస్కృతి, ఆధ్యాత్మిక భావన మొదలైన వాటికి చిహ్నంగా పరిగణిస్తారు. శంఖం నుంచి వెలువడే శబ్ధం ప్రార్థన వంటి పవిత్రమైన లేదా శుభకరమైన కార్యక్రమాలు చేపట్టే ముందు స్వచ్చంగా ఉండేందుకు ఊదుతారు. శంఖం అంటే శుభానికి సంకేతంగా మాత్రమే కాదు వేరే అర్థాలు కూడా ఉన్నాయి.

హిందూ ఆచారాలు, వేడుకల్లో తప్పనిసరిగా శంఖం ఉంటుంది. కొంతమంది తమ ఇళ్ళలో దక్షిణామూర్తి శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటారు. శంఖం మహా విష్ణువు, లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు. పురాణాల ప్రకారం విష్ణువు పాంచజన్య అనే తన శంఖాన్ని పట్టుకుని కనిపిస్తాడు. భగవద్గీత చెప్పిన దాని ప్రకారం మహా భారత యుద్దం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు శంఖాన్ని ఊదాడు. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా చాలా చూస్తూనే ఉంటాం. చరిత్రలో శంఖం గొప్ప యుద్ధాల ప్రారంభాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. కర్తవ్యానికి పిలుపు, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.

శంఖం వెనుక ఒక చిన్న కథ కూడా ఉంటుంది. వేదాలు చెప్పే దాని ప్రకారం శంఖాసురుడు అనే రాక్షసుడిని ఓడించిన తర్వాత విష్ణువు ఆ రాక్షసుడి శంఖాకార చెవి ఎముకని తీసుకుని ఊదాడు. అప్పుడే దాని నుంచి ఓం శబ్దం ఉద్భవించిందని అంటారు.

స్వచ్చతకు చిహ్నం

శంఖం ద్వారా వెలువడే ధ్వని పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతికూల శక్తులని దూరం చేసి సానుకూలతని తీసుకొస్తుందని నమ్ముతారు. మతపరమైన ఆచారానికి ముందు ఇది ఊదినప్పుడు పరిసరాలు శుభ్రపరిచే సాధనంగా పరిగణించబడుతుంది. దైవిక కార్యకలపాలకి అనుకూలంగా ఉంటుంది. శంఖం స్వరం దైవానికి పిలుపులాంటిది. మతపరమైన వేడుకలు ప్రారంభించే ముందు శంఖం ఊదారంటే దేవతలని ఆహ్వానిస్తున్నట్టు అర్థం. ఈ శబ్ధంతో ఆరాధకుడికి, దైవానికి మధ్య సంబంధం ఏర్పరుస్తుందని నమ్ముతారు.

దేవాలయాలలో ఎందుకు శంఖం ఊదుతారు?

హిందూ దేవాలయాలలో హారతి లేదా పూజ వంటి రోజువారీ ఆచారాల ప్రారంభానికి గుర్తుగా శంఖాన్ని ఊదుతారు. కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజ చేసుకుని శంఖం ఊదుతారు. ఇలా చేయడం వల్ల ఇల్లు శుద్ధికరణకి ప్రతీకగా చెప్తారు. దీపావళి, నవరాత్రి, దుర్గాపూజ వంటి పండుగల సమయంలో కూడా శంఖాన్ని ఊదుతారు. దీని శబ్ధం ఉత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక సారాన్ని గుర్తు చేస్తుంది.

శంఖాన్ని ఊదడం వల్ల రాజ్ సిక్, తాంసిక్ మూలకాలు, వాతావరణంలో ఉన్న ప్రతికూల శక్తుల్ని తొలగించి వేస్తుంది. శంఖాన్ని ఊదడం వల్ల మానవులకి పవిత్రంగా, ప్రశాంతంగా, శుభప్రదంగా భావించే సాత్విక లక్షణాలకి ఆకర్షితులు అవుతారు. దీన్ని ఊదటం అనేది కాస్త ఒత్తిడితో కూడుకున్నది.

శంఖం ఊదడానికి సరైన మార్గం ఏది?

శంఖం ఊదడం వల్ల ఊపిరితిత్తుల కండరాలు, మల కండరాలు, ముఖ కండరాలు మొదలైన వాటిపై ఒత్తిడి పడుతుంది. అజాగ్రత్తగా ఊదడం వల్ల కన్ను, చెవి కండరాలు కూడా దెబ్బతింటాయి. అందుకే శంఖం ఎలా ఊదాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. శంఖం ఊదేటప్పుడు చాలా మంది ముక్కుతో కాకుండా నోటి ద్వారా గాలిని పీల్చుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పొట్టలోకి గాలి వెళ్ళి ఎక్కువ సేపు నిలవదు. అందుకే శంఖం ఊదుతున్నప్పుడు తప్పనిసరిగా ముక్కు ద్వారానే గాలి పీల్చుకోవాలి.

శంఖాన్ని ఎవరు ఊదకూడదు?

శంఖం తప్పుగా ఊదడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే వృద్ధులు, హెర్నియా లేదా అధిక రక్తపోటుతో బాధపడే వ్యక్తులు శంఖం ఊదకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ చర్య అవయవాల మీద అధిక ఒత్తిడి తీసుకొస్తుంది.

WhatsApp channel