తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rains : ఏపీకి భారీ వర్ష సూచన- రాగల రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన- రాగల రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 28, 2024 09:52 PM IST

AP Rains : ద్రోణి, నైరుతి రుతుపవనాల విస్తరణలో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు.

ఏపీకి భారీ వర్ష సూచన- రాగల రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీకి భారీ వర్ష సూచన- రాగల రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

AP Rains : ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రేపు(శనివారం) ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆదివారం అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశుగొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడూ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జూన్ నెలలో ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో అత్యధికంగా 184 మి.మీ అతిభారీ వర్షపాతం నమోదైందన్నారు. తరచూ వరదలు సంభవించే నదీపరివాహక ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్..

అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అనిత సమీక్షించారు. తుపాన్ ప్రభావంతో నదీపరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగుల ద్వారా గోదావరి, వంశధార, నాగావళి నదుల్లోకి వరద నీరు చేరుతోందని అన్నారు. వర్షాలు, వరదలపై ఇప్పట��కే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ.. వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయన్నారు. వర్షాలు, తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో దేవీపట్నం నదీపరివాహక ప్రాంతంలో వీఆర్వో, వీఆర్ఏలతో పాటు ఇతర అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారని తెలిపారు. దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారని, సహాయక చర్యల నిమిత్తం గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల సంభవించే పరిస్థితులపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాలైన నాసిక్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. గొట్టా బ్యారేజీ వంటి తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో తహశీల్దార్లు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పరిశీలన..

స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించగా 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు. వాతావరణ పరిశోధన విభాగాలలోని వివిధ అంశాలను తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విపత్తుల సమయంలో నిరంతరం పర్యవేక్షిస్తూ అలర్ట్స్ పంపే విధానాన్ని అధికారులు మంత్రికి విశదీకరించారు. కామన్ అలర్ట్ ప్రోటోకాల్ , ఏపీ అలర్ట్ సెంటర్ ద్వారా ప్రజలకు హెచ్చరిక సందేశాలు ఏవిధంగా చేరుతాయో ప్రత్యక్షంగా చూపించారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శాటిలైట్ ఫోన్స్, శాటిలైట్ బేస్డ్ మొబైల్ డేటా వాయిస్ టెర్మినల్ , వాకీటాకీ, వి-శాట్ కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం