తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bcom General Course: ఏపీలో ప్రభుత్వ కాలేజీల్లో బికాం జనరల్ కోర్సు రద్దు, కళాశాల విద్యాశాఖ నిర్ణయం

Bcom General Course: ఏపీలో ప్రభుత్వ కాలేజీల్లో బికాం జనరల్ కోర్సు రద్దు, కళాశాల విద్యాశాఖ నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Jul 04, 2024 11:56 AM IST

Bcom General Course: ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ కాలేజీల్లో బికాం జనరల్ డిగ్రీ కోర్సును పూర్తిగా తొలగించారు. కొన్నేళ్లుగా బికాం కోర్సులో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టడంతో ఆ కోర్సును రద్దు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బికాం జనరల్ కోర్సు రద్దు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బికాం జనరల్ కోర్సు రద్దు

Bcom General Course: ఏపీలో ఇకపై ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల్లో బీకాం జ‌న‌ర‌ల్ కోర్సు ఉండ‌దు. బీకాం జ‌న‌ర‌ల్ కోర్సును తొల‌గిస్తూ రాష్ట్ర క‌ళాశాల విద్యా శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఆ కోర్సును మూసివేసిన‌ట్లు తెలుపుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల్లో కేవ‌లం బీకాం కంప్యూట‌ర్ కోర్సు మాత్ర‌మే ఉంటుంద‌ని, ఆ కోర్సు ఒక్క‌టే నిర్వ‌హించేలా రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో బీకాం జ‌న‌ర‌ల్‌లో అడ్మిష‌న్లు త‌క్కువ‌గా ఉండ‌టంతోనే ఆ కోర్సును తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

రాష్ట్రంలోని అటాన‌మ‌స్ (స్వయంప్ర‌తిప‌త్తి) క‌ళాశాల్లో బీకాం జ‌న‌ర‌ల్ కోర్సు ఉంటుంద‌ని, అలాగే బీకాం కంప్యూటర్స్ కోర్సు కూడా ఉంటాయ‌ని తెలిపింది. స్వయం అటాన‌మ‌స్ కాలేజీల్లో రెండు కోర్సులు నిర్వ‌హిస్తుండ‌గా, మిగ‌తా డిగ్రీ కాలేజీల్లో బీకాం కంప్యూట‌ర్ కోర్సు ఒక్క‌టే అమ‌లు చేయాల‌ని ఆదేశించింది.

రాష్ట్రంలో 169 ప్ర‌భుత్వ డిగ్రీ కళాశాల‌లు ఉండ‌గా, 21 స్వ‌యంప్ర‌తిప‌త్తి (అటాన‌మ‌స్‌) కాలేజీలు ఉన్నాయి. చార్ట‌ర్డ్ అకౌంట్స్( సీఏ) చేయాల‌నుకున్న విద్యార్థులు బీకాం జ‌న‌ర‌ల్‌లోనే ప్ర‌వేశాలు పొందుతార‌ని, కొత్త‌గా వ‌చ్చిన మార్పు కార‌ణంగా జీఎస్‌టీ, ఈ-ఫైలింగ్ వంటి అంశాల‌పై పాఠ్యాంశాలు ఉన్నాయి. దీనివ‌ల్ల ప్రైవేట్ ఉద్యోగాలు పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల అన్ని క‌ళాశాల‌ల్లోనూ బీకాం జ‌న‌ర‌ల్ కోర్సును కొన‌సాగించాల‌ని విద్యార్థులు, అధ్య‌ప‌కులు కోరుతున్నారు. ఇప్ప‌టికే చాలా ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల్లో అధ్య‌ప‌కులు ఉన్నారు.

ప్రభుత్వం నిర్ణ‌యం ఇప్ప‌టికే అడ్మిష‌న్ల ప్ర‌క్రియ‌లో ఉన్న బీకాం జ‌న‌ర‌ల్ కోర్సు చేయాల‌నుకునే విద్యార్థుల‌కు చేదు వార్త కానుంది . వారంతా ప్ర‌భుత్వం కాలేజీలో బీకాం జ‌న‌ర‌ల్ కోర్సు తొల‌గించ‌డంతో అటాన‌మ‌స్ కాలేజీల్లో చేరాల్సి వ‌స్తుంది. అయితే అటానమస్‌ కాలేజీ ఫీజులు ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీల‌తో పోలిస్తే, ఎక్కువ‌గా ఉంటాయి.

దీంతో అటాన‌మ‌స్ కాలేజీల ఫీజులు చెల్లించ‌డంలో విద్యార్థుల‌కు భారం పెరుగుతుంది. ప్ర‌భుత్వ కాలేజీల్లో ఈ కోర్సు ఉంటే, ఫ్రీ సీటు వ‌స్తుంది. అదే అటాన‌మ‌స్ కాలేజీల్లో అయితే ఫీజులు ఎక్కువ చెల్లించి బీకాం కోర్సు చేయాల్సి ఉంటుంది.

క‌నుక విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఈ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ప్ర‌భుత్వ కాలేజీల్లో బీకాం జ‌న‌ర‌ల్ కోర్సు తొల‌గింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. బీకాం జ‌న‌ర‌ల్ కోర్సును అన్ని ప్ర‌భుత్వ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకురావాల‌ని కోరుతున్నారు. ఈ ఏడాది బీకాం జ‌న‌ర‌ల్ కోర్సును తొల‌గిస్తే, వ‌చ్చే ఏడాది నుంచి కూడా ఆ కోర్సు ప్ర‌భుత్వ కాలేజీల్లో అందుబాటులో ఉండ‌ద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ర‌కంగా బీకాం జ‌న‌ర‌ల్ కోర్సు ప్ర‌భుత్వ కాలేజీల్లో శాశ్వ‌తంగా ర‌ద్దు అవుతుంద‌ని అంటున్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel