తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England Semifinal: రోహిత్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన సూర్య.. ఇంగ్లండ్‌పై టీమిండియా మోస్తరు స్కోరు

India vs England Semifinal: రోహిత్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన సూర్య.. ఇంగ్లండ్‌పై టీమిండియా మోస్తరు స్కోరు

Hari Prasad S HT Telugu
Jun 28, 2024 12:06 AM IST

India vs England Semifinal: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, సూర్యకుమార్ మెరుపులు.. చివర్లో హార్దిక్, జడేజా, అక్షర్ తలా ఓ చేయి వేయడంతో ఇంగ్లండ్ పై టీమిండియా మంచి స్కోరు సాధించింది.

రోహిత్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన సూర్య.. ఇంగ్లండ్‌పై టీమిండియా మోస్తరు స్కోరు
రోహిత్ హాఫ్ సెంచరీ.. చెలరేగిన సూర్య.. ఇంగ్లండ్‌పై టీమిండియా మోస్తరు స్కోరు (AP)

India vs England Semifinal: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో టీమిండియా మంచి స్కోరు సాధించింది. బ్యాటింగ్ కు అంతగా అనుకూలించని పిచ్ పై ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్.. ఇండియాకు మంచి స్కోరు అందించారు. వీళ్లకు తోడు చివర్లో హార్దిక్, జడేజా, అక్షర్ పటేల్ రాణించడంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 రన్స్ చేసింది. రోహిత్ 57, సూర్య 47, హార్దిక్ 23, జడేజా 19 రన్స్ చేశారు.

రోహిత్, సూర్య బాదుడు

ఇంగ్లండ్ తో రెండో సెమీఫైనల్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రాణించారు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్ లో కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. అదే ఫామ్ సెమీఫైనల్లోనూ కొనసాగించాడు. అయితే ఆ మ్యాచ్ తో పోలిస్తే పిచ్ అంత అనుకూలంగా లేకపోవడంతో అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును కదిలించాడు.

అతడు 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్ లతో 57 రన్స్ చేసి ఔటయ్యాడు. అప్పటికే అతడు సూర్యకుమార్ తో కలిసి మూడో వికెట్ కు 73 పరుగులు జోడించాడు. అటు సూర్యకుమార్ కూడా రోహిత్ ఔటైన కాసేపటికే పెవిలియన్ చేరాడు. సూర్య 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 47 రన్స్ చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.

విరాట్ కోహ్లి మళ్లీ.. పంత్ ఫెయిల్

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు మరోసారి అంత మంచి ఆరంభం లభించలేదు. చెత్త ఫామ్ తో సతమతమవుతున్న విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. అతడు 9 బంతుల్లో 9 పరుగులు చేసి టోప్లీ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. అతని బౌలింగ్ లోనే ఓ కళ్లు చెదిరే సిక్స్ కొట్టినా.. ఆ ఫామ్ కొనసాగించలేకపోయాడు.

మూడో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడా నిరాశ పరిచాడు. అతడు కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇండియా పవర్ ప్లే ముగిసే లోపే 5.2 ఓవర్లలో 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రోహిత్ శర్మకు జత కలిసిన సూర్యకుమార్ ఇన్నింగ్స్ ను మళ్లీ గాడిలో పెట్టాడు.

టీ20 వరల్డ్ కప్ 2024