తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Election 2024 Results : పార్టీ కండువా మార్చారు - విజయం కొట్టేశారు..! ఎవరెవరంటే..?

AP Election 2024 Results : పార్టీ కండువా మార్చారు - విజయం కొట్టేశారు..! ఎవరెవరంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 06, 2024 03:14 PM IST

Andhra Pradesh Election 2024 Results: ఏపీ ఎన్నికల్లో పార్టీలు మారిన చాలా మంది నేతలు విజయం సాధించారు. కూటమి నుంచే అందరూ గెలవగా… వైసీపీ నుంచి పోటీ చేసిన వారంతూ ఓటమి చెందారు.

ఏపీ ఎన్నికల ఫలితాలు 2024
ఏపీ ఎన్నికల ఫలితాలు 2024

Andhra Pradesh Election 2024 Results:  రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు పార్టీ మారిన వాళ్లకు పండగగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలకు మారిన వారంతా విజయం సాధించారు. అయితే దీనికి భిన్నంగా గత ఎన్నికల్లో పార్టీ మారిన వారంతా  ఓటమి చెందారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారంతా విజయం సాధించారు. అలాగే వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారంతా గెలుపొందారు.  బీజేపీ నుంచి టీడీపీలో చేరిన వారు కూడా గెలిచారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారంతా ఓటమి చెందారు. అలాగే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారు కూడా ఓటమి చెందారు.

టీడీపీలో 5 మంది ఎంపీలు విజయం…

టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఐదుగురు ఎంపీలు విజయం సాధించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు. అలాగే నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి, బీజెపీ నుంచి టీడీపీలో చేరిన బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా, తన్నేటి కృష్ణప్రసాద్ బాపట్ల ఎంపీగా విజయం సాధించారు.

టీడీపీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలుపు…

టీడీపీలో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గంలో విజయం సాధించింది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి కొలుసు పార్థసారథి, మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్, గుంతకల్లు నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, సత్యవేడు అసెంబ్లీ నియోజవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పోటీ చేసి గెలుపొందారు. వైసీపీ ఎంపి రఘురామ కృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయనకు టీడీపీ ఉండి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చింది. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు.

జనసేనలో 5 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుపు

జనసేనలో వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు ఐదుగురు ఎమ్మెల్యే, ఒక ఎంపీగా విజయం సాధించారు. టీడీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులకు భీమవరం ఎమ్మెల్యే సీటు‌ దక్కింది. ఆయన విజయం సాధించారు. 

వైసీపీ నుంచి జనసేనలో చేరిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, అదే స్థానం నుంచి జనసేన తరపున పోటీచేసి విజయం సాధించారు. అలాగే వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్, జనసేనలో చేరి విశాఖ సౌత్ టిక్కెట్టు దక్కించుకొని, గెలుపొందారు. అలాగే టీడీపీ నుంచి జనసేనలో చేరిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అదే స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసి విజయం సాధించారు‌. జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్టు దక్కించుకున్నారు. ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ నుంచి జనసేనలో చేరి, మచిలీపట్నం టిక్కెట్టు దక్కించుకున్న వల్లభనేని బాలశౌరి విజయం సాధించారు.

బీజేపీలో ఇద్దరు ఎంపిలు, ఇద్దరు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఎన్నికల ముందు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బీజేపీలో చేరారు. ఆయనకు విజయవాడ పశ్చిమ సీటును బీజేపీ ఆయనకు ఇచ్చింది. ఈ స్థానంలో ఆయన విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దగ్గుపాటి పురందేశ్వరి రాజమండ్రి ఎంపిగానూ, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

ఓటమి చెందిన పార్టీలు మారిన నేతలు

కాంగ్రెస్, వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ముగ్గురు ఓటమి చెందగా, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురు ఓటమి చెందారు. ఇక పార్టీలు మారిన నేతలు ఓటమి కూడ చవిచూశారు. 

వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వరప్రసాద్ బీజేపీ తరపున తిరుపతి ఎంపీ టిక్కెట్టు దక్కించుకున్నారు. అయితే ఆయన ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట ఎంపీ టిక్కెట్టు, వైసీపీ నుంచి బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత అరకు ఎంపీ సీటు దక్కాయి.‌ కానీ వీరిద్దరూ ఓటమి చెందారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నానికి విజయవాడ ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ గన్నవరం నుంచి, కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ చీరాల నుంచి, దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel

టాపిక్