తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఆలయంలోని మూడో మెట్టు ఎక్కితే మీరు చేసిన పుణ్యం అంతా పోతుందట

ఈ ఆలయంలోని మూడో మెట్టు ఎక్కితే మీరు చేసిన పుణ్యం అంతా పోతుందట

Gunti Soundarya HT Telugu
Jun 28, 2024 05:02 PM IST

ఎక్కడైనా ఆలయం సందర్శిస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి. కానీ ఈ ఆలయంలోని మూడో మెట్టు ఎక్కితే మాత్రం పొందిన పుణ్యఫలం తొలగిపోతుంది. ఈ వింతైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

పూరీ జగన్నాథ ఆలయం
పూరీ జగన్నాథ ఆలయం (PTI)

సాధారణంగా ఆలయానికి వెళ్ళి మొక్కులు చెల్లించుకుంటే దైవానుగ్రహం పొందుతారు. చేసిన పాపాల నుంచి విముక్తి పొందటం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శించి పవిత్ర నదీ స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగి మరణించిన తర్వాత మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కానీ ఈ ఆలయంలోని ఒక మెట్టు ఎక్కితే మాత్రం చేసిన పుణ్యఫలం అంతా పోతుంది. నరకలోకానికి వెళ్తారని చెప్తారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఏమిటి అనే విషయాలు మీ కోసం.

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం ఈ ఆలయం. మరికొద్ది రోజుల్లో పూరీ జగన్నాథ రథయాత్ర మొదలుకాబోతుంది. ఈ ఆలయం నిత్యం మంత్రోచ్చారణలతో మార్మోగిపోతుంది. జులై 7 నుంచి జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించేందుకు నాలుగు ద్వారాలు ఉంటాయి. ఆలయంలోని జగన్నాథుడిని సమీపించేందుకు భక్తులు 22 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లలో ఒక మెట్టు ఎక్కితే మాత్రం మనిషి చేసిన పుణ్యఫలాలు అన్నీ తొలగిపోతాయి. అతడు నరకలోకానికి వెళ్లాల్సి వస్తుందని అంటారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది.

యముడి అభ్యర్థన

ఒకనాడు శ్రీకృష్ణుడి దగ్గరకు యమధర్మరాజు వస్తాడు. జగన్నాథ ఆలయాన్ని సందర్శించి భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటున్నారు . దీని వల్ల యమలోకానికి ఎవరు రావడం లేదని చెప్పాడట. ప్రజల పాపాలను, చెడు కర్మలను చెరిపివేయకూడదని యమధర్మరాజు భగవంతుడైన జగన్నాథుడిని వేడుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందమే కథగా మారింది.

మూడవ మెట్టు యమశిల

యమధర్మరాజు మోర ఆలకించిన జగన్నాథుడు తన మందిరానికి వెళ్లేందుకు ఎక్కే మూడవ మెట్టు మీద నివసించమని సలహా ఇచ్చాడు. ఆ మెట్టుని యమశిల అంటారు. ఇది నల్లరాయి, మిగతా వాటి కంటే భిన్నంగా కనిపిస్తుంది. మందిరం వైపు వెళ్లేటప్పుడు ప్రజలు ఎవరైతే యమశిల మీద అడుగు పెడతారో వాళ్ళు తమ పుణ్యం మొత్తాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళు యమలోకానికి వెళతారు.

మరొక కథ

యమశిల గురించి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. జగన్నాథుడి వైపు వెళ్తున్నప్పుడు భక్తులు యమశిలగా భావించే మూడవ మెట్టు మీద అడుగుపెట్టినప్పుడు వాళ్ళు చేసిన పాపాలు, చెడు కర్మలు అన్నీ తొలగిపోతాయని అంటారు. వాళ్ళు స్వచ్చమైన హృదయంతో జగన్నాథుడిని చేరుకుంటారని భక్తుల విశ్వాసం. అయితే ఆలయం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం ఎవరైతే యమశిల మీద అడుగుపెడతారో వాళ్ళు జగన్నాథుడి దర్శన సమయంలో పొందిన పుణ్యఫలం అంతా పోగొట్టుకుంటారని చెబుతారు.

భక్తులు ఆలయ ప్రవేశమైన సింహ ద్వారం నుంచి లోనికి ప్రవేశించాలి. కానీ తిరిగి వెళ్లేటప్పుడు యమశిల ఉన్న మెట్ల మీద నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా బయటకు వెళ్తారట. అలా చేయడం వల్ల యమశిల దాటే అవసరం రాదు. ఈ మూడో మెట్టు గురించి అనేక కథలు, పురాణాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఈ సమయంలో భక్తులకు ప్రవేశం లేదు

ఏడాది పొడవునా భక్తులకు జగన్నాథుడిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రథయాత్రకు ముందు మాత్రం భక్తులకు స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఈ యాత్ర ప్రారంభం కావడానికి ముందు ప్రతి సంవత్సరం జగన్నాథుడు అనారోగ్యానికి గురావుతాడని నమ్ముతారు.

జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథుడికి 100 కలశాల నీటితో స్నానం చేయించిన తర్వాత అనారోగ్యానికి గురవయాఉతాడు. ఈ సమయంలో భక్తుల సందర్శన నిలిపివేసి స్వామి వారికి మూలికా మందులతో చికిత్స చేస్తారు. ఈ సమయంలోనే భగవంతుడు విశ్రాంతి తీసుకుని రథయాత్రకు సిద్ధమవుతాడని భక్తుల విశ్వాసం. జగన్నాథ రతయాత్రలో భక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా రథాన్ని లాగాలని కోరుకుంటారు. ఇలా చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

WhatsApp channel

టాపిక్