తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gulbadin Naib: ‘అఫ్గాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్‍కు ఆస్కార్ ఇవ్వాల్సిందే’! ఏం జరిగిందంటే..

Gulbadin Naib: ‘అఫ్గాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్‍కు ఆస్కార్ ఇవ్వాల్సిందే’! ఏం జరిగిందంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 25, 2024 02:58 PM IST

AFG vs BAN T20 World Cup 2024 - Gulbadin Naib: బంగ్లాదేశ్‍పై ఉత్కంఠ విజయం సాధించి అఫ్గానిస్థాన్ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ చేరింది. తొలిసారి సెమీస్‍కు అర్హత సాధించింది. అయితే, ఈ మ్యాచ్‍లో అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహారం బాగా వైరల్ అవుతోంది.

Afghanistan Cricket: ‘అఫ్గాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్‍కు ఆస్కార్ ఇవ్వాల్సిందే’! ఏం జరిగిందంటే..
Afghanistan Cricket: ‘అఫ్గాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్‍కు ఆస్కార్ ఇవ్వాల్సిందే’! ఏం జరిగిందంటే..

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో అఫ్గానిస్థాన్ సంచలనం సృష్టించింది. సూపర్-8 చివరి మ్యాచ్‍లో బంగ్లాదేశ్‍పై ఉత్కంఠ పోరులో విజయం సాధించి సెమీఫైనల్‍కు దూసుకెళ్లింది. ఐసీసీ టోర్నీల్లో అఫ్గాన్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‍ను అద్భుత బౌలింగ్‍లో అఫ్గాన్ చిత్తుచేసింది. చాలాసార్లు వర్షం అంతరాయలు, అనేక మలుపులతో ఈ మ్యాచ్ థ్రిల్లింగ్‍గా సాగింది. ఓ దశలో అఫ్గానిస్థాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైబ్ గాయమైనట్టు కిందపడడం హాట్‍టాపిక్‍గా మారింది. ఏం జరిగిందంటే..

ట్రాట్ సిగ్నల్.. గుల్బాదిన్‍కు గాయం!

లక్ష్యఛేదనలో ఓ దశలో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 81 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోంది. ఆ సమయంలో చినుకులు మొదలయ్యాయి. అప్పటికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఈ తరుణంలో ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు అఫ్గానిస్థాన్ హెడ్ కోచ్ జోనాథన్ ట్రాట్. వర్షం పెద్దగా వచ్చే వరకు కాస్త ఆలస్యం చేయాలనేలా సంకేతాలు సిగ్నల్స్ ఇచ్చాడు.

ఆ సమయంలో 12వ ఓవర్లో అఫ్గాన్ ప్లేయర్ గుల్బాదిన్ నైట్ స్లిప్‍లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్న అతడు ట్రాట్ నుంచి సిగ్నల్ రాగానే కింద పడుకున్నాడు. కాలి కండరం పట్టేసినట్టుగా విలవిల్లాడాడు. నొప్పితో బాధపడ్డాడు. వెంటనే అఫ్గాన్ ఫిజియో స్టాఫ్ వచ్చిన అతడిని పట్టుకొని డగౌట్‍కు తీసుకెళ్లారు. గుల్బాదిన్ కుంటుతూ కనిపించాడు. ఆ సమయంలోనే వాన రావడంతో మ్యాచ్ నిలిచింది. అయితే, వాన తగ్గి మళ్లీ ఆట మొదలయ్యాక గుల్బాదిన్ మళ్లీ బౌలింగ్ చేశాడు. నొప్పితో అంతలా విలవిల్లాడిన అతడు అరగంట ముగియకముందే మళ్లీ ఫిట్‍గా కనిపించి బౌలింగ్ చేసేశాడు. ఇదే హాట్‍టాపిక్ అయింది.

ఆస్కార్ ఇవ్వాల్సిందే

గుల్బాదిన్ నైబ్ కండరాలు పట్టేసినట్టు విలవిల్లాడుతున్న సమయంలో కామెంటరీ చేస్తున్న సైమన్ డౌల్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆస్కార్, ఎమ్మీ అవార్డు పర్ఫార్మెన్స్‌ను గుల్బాదిన్ చేస్తున్నాడని అన్నారు. అతడు కావాలనే నటిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. కామెంటరీ బాక్సులో అందరూ పగలబడి నవ్వారు. సోషల్ మీడియాలోనూ చాలా మంది ఈ విషయంపై స్పందిస్తున్నారు. గుల్బాదిన్ నైబ్‍ అద్భుతంగా నటించాడని, ఆస్కార్ ఇవ్వాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఎందుకలా చేస్తున్నావంటూ గుల్బాదిన్‍ను అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా ప్రశ్నించాడు.

వాన వల్ల బంగ్లాదేశ్ లక్ష్యఛేదనలో మ్యాచ్‍ను అంపైర్లు 19 ఓవర్లకు కుదించి.. లక్ష్యాన్ని 114కు తగ్గించారు. అయితే, బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్, నవీనుల్ హక్ చెరో నాలుగు వికెట్లు తీసుకొని బంగ్లాదేశ్‍ను కూల్చేశారు. బ్యాటింగ్‍లో తక్కువ స్కోరే చేసినా.. బౌలింగ్‍లో సత్తాచాటి అఫ్గాన్ అద్భుత విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ గెలువడంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

గుల్బాదిన్‍పై జంపా అసంతృప్తి

గుల్బాదిన్ నైబ్‍ వ్యవహార శైలిపై ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఓల్డ్ రైన్‍స్ట్రింగ్’ అంటూ న్‍స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేశాడు. వాన వల్ల గాయం వచ్చిందా అనేలా వ్యంగ్యంగా విమర్శించాడు. ఫేక్ ఇంజూరీ అనేలా అభిప్రాయపడ్డాడు.

అఫ్గానిస్థాన్‍లో సంబరాలు

అఫ్గానిస్థాన్ సెమీఫైనల్ చేరడంతో ఆ దేశంలో సంబరాలు భారీస్థాయిలో జరిగాయి. తాలిబన్ పాలనలో ఉన్న ఆ దేశంలో ప్రజలు వేలాది రోడ్లపై వచ్చి సెలెబ్రేట్ చేస్తున్నారు. టపాసులు కాల్చారు.

టీ20 ప్రపంచకప్ 2024 తొలి సెమీఫైనల్‍లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ జూన్ 27వ తేదీ ఉదయం (భారత కాలమానం) తలపడనున్నాయి. రెండో సెమీస్‍లో జూన్ 27న రాత్రి భారత్, ఇంగ్లండ్ పోటీపడనున్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024