తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Afg Vs Ban: ఆఫ్ఘనిస్థాన్ చారిత్రక విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి.. ఆస్ట్రేలియా ఔట్

Afg vs Ban: ఆఫ్ఘనిస్థాన్ చారిత్రక విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి.. ఆస్ట్రేలియా ఔట్

Hari Prasad S HT Telugu
Jun 25, 2024 10:52 AM IST

Afg vs Ban: ఆఫ్ఘనిస్థాన్ చారిత్రక విజయం సాధించింది. చివరి సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసి తొలిసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ విజయం కోసం ప్రార్థించిన ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది.

ఆఫ్ఘనిస్థాన్ చారిత్రక విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి.. ఆస్ట్రేలియా ఔట్
ఆఫ్ఘనిస్థాన్ చారిత్రక విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి.. ఆస్ట్రేలియా ఔట్ (AP)

Afg vs Ban: టీ20 వరల్డ్ కప్ 2024లో చివరి సెమీఫైనల్ బెర్త్ ఆఫ్ఘనిస్థాన్ ను వరించింది. పసికూనగా ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టి పెను సంచలనమే సృష్టించింది. తొలిసారి సెమీస్ చేరి చరిత్రను తిరగరాసింది. బంగ్లాదేశ్ తో నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ లో 8 పరుగులతో గెలిచింది. ఆఫ్ఘన్ విజయంతో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. తొలి సెమీఫైనల్ సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనుంది.

ఆస్ట్రేలియా ఔట్.. ఆఫ్ఘనిస్థాన్ ఇన్

బంగ్లాదేశ్ విజయం కోసం ప్రార్థించిన ఆస్ట్రేలియాకు నిరాశే ఎదురైంది. వర్షంతోపాటు విజయం కూడా రెండు జట్లతో దోబూచులాడి చివరికి ఆఫ్ఘనిస్థాన్ ను వరించింది. బంగ్లాదేశ్ ను గెలిపించడానికి లిటన్ దాస్ (49 బంతుల్లో 54 రన్స్) చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆఫ్ఘన్ బౌలర్లు రషీద్ ఖాన్, నవీనుల్ హక్ చెరో 4 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది.

చివర్లో 9 బంతుల్లో 9 పరుగులు అవసరం అయిన సమయంలో ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్ అద్భతమే చేశాడు. రెండు వరుస బంతుల్లో తస్కిన్, ముస్తఫిజుర్ రెహమాన్ లను ఔట్ చేసి ఆఫ్ఘన్ జట్టుకు 8 పరుగుల విజయాన్ని అందించాడు. ఇప్పటికే ఏ వరల్డ్ కప్ లోనూ ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ చేరలేదు. దీంతో ఈ విజయం ఆ దేశ క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.

సెమీస్‌కు క్వాలిఫై కావడం కోసం..

నిజానికి ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 రన్స్ చేసింది. ఆ టీమ్ ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ 43 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో చేజ్ చేస్తే బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరే అవకాశం ఉండేది. దానికోసమే ఆ టీమ్ బ్యాటర్లు ప్రయత్నించారు. వచ్చీ రాగానే ఆఫ్ఘన్ బౌలర్లపై దాడికి దిగారు.

వరుసగా వికెట్లు పడుతున్న వెనక్కి తగ్గలేదు. ఓవైపు లిటన్ దాస్ క్రీజులో పాతుకుపోగా.. మరోవైపు క్రీజులోకి వచ్చిన ఇతర బ్యాటర్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. చేజింగ్ లో 64 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఆఫ్ఘన్ సులువుగా గెలుస్తుందని భావించారు. అయితే లిటన్ దాస్ మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరి వరకూ పోరాడాడు.

సెమీస్ ఆశలు వదిలేసుకున్న తర్వాత కనీసం గెలిచి పరువు నిలుపుకుందామనుకొని బంగ్లాదేశ్ నెమ్మదిగా ఆడింది. ఒకవేళ బంగ్లా గెలిచి ఉంటే ఆస్ట్రేలియా సెమీస్ చేరేది. కానీ ఆఫ్ఘన్ బౌలర్లు మాత్రం తగ్గేదే లేదన్నట్లుగా చివరి వరకూ పోరాడి 8 పరుగులతో గెలిపించారు. ఇక ఆ టీమ్ గురువారం (జూన్ 27) ఉదయం 6 గంటలకు జరగబోయే తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడనుంది.

మరో సెమీఫైనల్ అదే రోజు రాత్రి 8 గంటలకు ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతుంది. సెమీస్ వరకు సంచలన విజయాలతో దూసుకొచ్చిన ఆఫ్ఘన్ టీమ్.. అక్కడ సౌతాఫ్రికాపై ఏం చేస్తుందో చూడాలి. ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలాంటి హాట్ ఫేవరెట్స్ కు కూడా షాకిచ్చిన ఆ జట్టును సఫారీలు కూడా తేలిగ్గా తీసుకోరు అనడంలో సందేహం లేదు.

టీ20 వరల్డ్ కప్ 2024