తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: చితక్కొట్టిన రోహిత్ శర్మ.. 8 సిక్స్‌లతో రెచ్చిపోయిన హిట్‍మ్యాన్.. కాస్తలో సెంచరీ మిస్.. భారత్ భారీ స్కోరు

IND vs AUS: చితక్కొట్టిన రోహిత్ శర్మ.. 8 సిక్స్‌లతో రెచ్చిపోయిన హిట్‍మ్యాన్.. కాస్తలో సెంచరీ మిస్.. భారత్ భారీ స్కోరు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 24, 2024 09:59 PM IST

IND vs AUS T20 World Cup 2024: ఆస్ట్రేలియా బౌలర్లను భారత కెప్టెన్ రోహిత్ శర్మ చితకబాదేశాడు. దీంతో సూపర్-8 మ్యాచ్‍లో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఆసీస్‍కు బిగ్ టార్గెట్ ఇచ్చింది.

IND vs AUS: చితక్కొట్టిన రోహిత్ శర్మ.. 8 సిక్స్‌లతో రెచ్చిపోయిన హిట్‍మ్యాన్.. కాస్తలో సెంచరీ మిస్.. భారత్ భారీ స్కోరు
IND vs AUS: చితక్కొట్టిన రోహిత్ శర్మ.. 8 సిక్స్‌లతో రెచ్చిపోయిన హిట్‍మ్యాన్.. కాస్తలో సెంచరీ మిస్.. భారత్ భారీ స్కోరు (Surjeet Yadav)

India vs Australia T20 World Cup: భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపం చూపాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8 మ్యాచ్‍లో ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదేశాడు. హిట్టింగ్ మోతెక్కించాడు హిట్‍మ్యాన్. 41 బంతుల్లోనే 92 పరుగులతో రోహిత్ దుమ్మురేపాడు. సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో నేడు (జూన్ 24) జరుగుతున్న గ్రూప్ 1 సూపర్-8 మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా ముందు 206 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. టీమిండియా బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

రోహిత్ శర్మ ధనాధన్.. ఒకే ఓవర్లో 4 సిక్స్‌లు

ఆస్ట్రేలియా బౌలర్లకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ చుక్కలు చూపించాడు. 41 బంతుల్లో 92 పరుగులతో దుమ్మురేపాడు. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో హిట్‍మ్యాన్ రెచ్చిపోయాడు. టాస్ ఓడి ముందుగా భారత్ బ్యాటింగ్‍కు దిగగా.. బ్యాటర్ విరాట్ (0) డకౌట్ అయి ఈ టోర్నీలో మరోసారి నిరాశపరిచాడు. అయితే, రోహిత్ శర్మ మాత్రం వీరకుమ్ముడు కుమ్మేశాడు. ఏ దశలోనూ దూకుడు తగ్గించలేదు. తన మార్క్ షాట్లతో ధనాధన్ ఆట ఆడాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్‍లో ఓడించిన ఆసీస్‍ను కసి తీరా కొట్టాడు.

ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ శర్మ నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. అదిరిపోయే షాట్లతో స్టార్క్‌కు చెమటలు పట్టించాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు. రోహిత్ జోరుతో ఆరు ఓవర్లలోనే భారత్ 60 పరుగులు చేసింది.

సెంచరీ మిస్

రిషబ్ పంత్ (14 బంతుల్లో 15 పరుగులు) కాసేపు నిలిచినా వేగంగా ఆడలేకపోయాడు. 8వ ఓవర్లో స్టొయినిస్ బౌలింగ్‍లో ఔటయ్యాడు. అయితే, రోహిత్ శర్మ మాత్రం బాదుడు ఏ మాత్రం ఆపలేదు. అదే హిట్టింగ్ దూకుడు కంటిన్యూ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ (16 బంతుల్లో 31 పరుగులు; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) కూడా జోరు చూపాడు. దీంతో 10 ఓవర్లలో భారత్ 114 పరుగులు చేసింది. అయితే, 12 ఓవర్లలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‍లోనే రోహిత్ శర్మ 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. దీంతో 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 15వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్‍ను కూడా స్టార్క్ ఔట్ చేశాడు.

బాదిన హార్దిక్

రోహిత్, సూర్య ఔటయ్యాక పరుగులు అంత వేగంగా రాలేదు. కాసేపు నిలకడగా ఆడిన శివం దూబే (22 బంతుల్లో 28), హార్దిక్ పాండ్యా ఆ తర్వాత దూకుడు పెంచారు. హార్దిక్ 17 బంతుల్లో 27 పరుగులతో (ఓ ఫోర్, 2 సిక్స్‌లు) మెరిపించాడు. దూబే ఔటైనా చివరి వరకు నిలిచాడు. మొత్తంగా 205 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా.

రోహిత్ మరో ఘనత

అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్స్‌లు బాదిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్టిల్ (173 సిక్స్‌లు) ఉన్నాడు. మూడో స్థానంలో జోస్ బట్లర్ (137 సిక్స్‌లు) ఉన్నాడు.

తన చివరి సూపర్-8 మ్యాచ్ అయిన దీంట్లో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్‍కు చేరుకుంటుంది. ఆస్ట్రేలియా ఓడితే ఆ జట్టుకు అవకాశాలు క్లిష్టమవుతాయి. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితంపై ఆసీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

టీ20 వరల్డ్ కప్ 2024